హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ

హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ

హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ
హార్దిక్, రాహుల్‌‌ కామెంట్స్‌పై పెదవి విప్పిన కోహ్లీ

భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా స్పందించాడు. ఆస్ట్రేలియాతో శనివారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ మొదలుకానుండగా.. ఈరోజు మీడియాతో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఆ సమయంలో హార్దిక్, రాహుల్ ఇటీవల ప్రసారమైన ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో చేసిన కామెంట్స్‌ గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో.. ఆ కామెంట్స్‌పై తొలిసారి పెదవి విప్పిన విరాట్ కోహ్లీ.. బీసీసీఐ పాలకుల కమిటీ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.

‘భారత్ జట్టుకి మేము ఆడుతున్నాం. కాబట్టి.. హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అయితే.. ఇటీవల ‘టాక్ షో’‌లో హార్దిక్, రాహుల్‌ వ్యక్తపరిచిన అభిప్రాయాలతో మేము ఏకీభవించడం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం బీసీసీఐ తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం’ అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. శనివారం ఉదయం సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ప్రారంభంకానుంది.

అసలు ఏం జరిగిందంటే..? బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘కాఫీ విత్ కరణ్’ షోకి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ వెళ్లారు. అక్కడ సరదా ప్రశ్నల్లో భాగంగా.. అమ్మాయిలు, డేటింగ్ గురించి చర్చ వచ్చింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన హార్దిక్ పాండ్య.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు’ అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు.

ఈ షో ఇటీవల ప్రసారంకాగా.. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. టీమిండియాకి ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ కోరగా.. కేఎల్ రాహుల్ ఇంకా స్పందించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *