పౌష్టికాహారం అడగడమే పాపమా? అంగన్‌వాడీ కార్యకర్త దాడితో గర్భస్రావం..!

పౌష్టికాహారం అడగడమే పాపమా? అంగన్‌వాడీ కార్యకర్త దాడితో గర్భస్రావం..!

ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పౌష్టికాహారం అడగడమే ఆమె పాలిట శాపమైంది. టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన బానోత్ పద్మ గర్భిణీ కావడంతో ప్రభుత్వం సరఫరా చేసే కోడిగుడ్ల కోసం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లింది. తనకు వచ్చే కోటా ఇవ్వాల్సిందిగా అక్కడి ఆయాను కోరింది. దీంతో కోడిగుడ్లు లేవంటూ ఆమె దురుసుగా ప్రవర్తించింది.

పౌష్టికాహారం ఇవ్వాలంటూ పద్మ పట్టుబట్టడంతో ఆయా ఆగ్రహంతో ఊగిపోయింది. ఆమెతో ఘర్షణకు దిగింది. అంతేకాదు గర్భిణీ అని చూడకుండా విచక్షణరహితంగా దాడిచేసింది. అక్కడే ఉన్న ఆయా భర్త కూడా పద్మపై దాడి చేసినట్లు సమాచారం. పౌష్టికాహారం కోసం వస్తే గర్భిణీ అని చూడకుండా పద్మను తీవ్రంగా కొట్టడం స్థానికంగా కలకలం రేపింది.
అంగన్‌వాడీ ఆయా దాడితో బాధితురాలికి తీవ్రగాయాలయ్యాయి. వైద్యం కోసం ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో పద్మకు గర్భస్రావం అయింది. దాడి జరిగిన సమయంలో అంగన్‌వాడీ టీచర్ అక్కడే ఉన్నా.. అడ్డుకోలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *